Saturday, September 4, 2010


జగపతిబాబు "గాయం -2" స్టామినా ఎంతంటే...???

 
నటీనటులు: జగపతిబాబు, విమలారామన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, హర్షవర్థన్, అజయ్, కోట ప్రసాద్, రవికాలె, శివకృష్ణ, జీవా తదితరులు. కెమేరా: అనిల్ భండారీ, సంభాషణలు: గంధం నాగరాజు, సంగీతం: ఇళయరాజా, ఎడిటింగ్: ప్రవీణ్, నిర్మాత: ధర్మకర్త, కథ, దర్శకత్వం: ప్రవీణ్ శ్రీ.

గాయం విడుదలై 15 ఏళ్లయిందనీ, ఆ చిత్రాన్ని తనతోపాటు ప్రేక్షకులు కూడా మర్చిపోయారని దర్శకుడు రామ్*గోపాల్ వర్మ వ్యాఖ్యానించినప్పటికీ.. గాయం -2 తీయడంలో ప్రవీణ్ శ్రీ పనితనం ఉట్టిపడింది. ముఖ్యంగా గాయం కథను కంటిన్యూగా కొనసాగించడానికి అల్లిన స్క్రీన్ ప్లే కుదిరింది. ఇతర నటీనటులు కూడా బాగానే సరిపోయారు.

తన జీవితాన్ని ప్రశాంతంగా ఏ గొడవలు లేనివిధంగా గడపాలనుకుంటాడు రామ్(జగపతిబాబు). బ్యాంకాక్*లో కాఫీ షాప్*ను నడుపుతుంటాడు. అతని భార్య విద్య(విమలా రామన్), కుమారుడు చైతు ( మాస్టర్ హరీష్), బావమరిది హర్షవర్థన్. సరదాగా సాగే రామ్ వ్యాపారంలో ఇద్దరు గూండాలు వచ్చి కాఫీ షాప్*లోని వెయిట్రస్*పై అసభ్యంగా ప్రవర్తించడంతో జరిగిన గొడవల్లో రామ్ వాళ్లిద్దరినీ చంపేస్తాడు.

ఆల్రెడీ వారు ఓ మర్డర్ చేసి వచ్చారు కనుక పోలీసు అధికారి పాండే( జీవా) రామ్*కు ధైర్యం చెపుతాడు. ఈ విషయం టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది. రామ్*ని ఓ హీరోలా థాయ్*లాండ్ చూస్తున్నదంటూ ప్రసారం అవుతుంది. కట్ చేస్తే.. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, దందాలు చేసే శంకర్ నారాయణ్( కోట ప్రసాద్) టీవీలో రామ్*ను చూసి దుర్గా అంటూ ఆవేశపడతాడు. ఈ విషయం తెలిసిన ప్రసాద్ తండ్రి గురునారాయణ్( కోట శ్రీనివాసరావు) అసలు వాడు దుర్గానా కాదా..? అంటూ తన కుమారునితోపాటు లాయర్ తనికెళ్ల భరణిని తోడుగా బ్యాంకాక్*కు పంపిస్తాడు.

కామ్*గా ఉండే రామ్*ను మానసికంగా హింసించడంతో తానే దుర్గా అని చెప్పేస్తాడు. దీంతో అక్కడ జరిగిన కొట్లాటలో శంకర్ నారాయణ్ చేతికి గాయమవుతుంది. అది తెలిసిన గురునారాయణ్ దుర్గాను చంపాలని తన అనుయాయులను పురమాయిస్తాడు. ముఖ్యమంత్రి పదవికోసం ఎంతమందినైనా చంపేసి శవాలపై పీఠాన్ని ఎక్కాలనే నీచ నికృష్ట నాయకుడు గురునారాయణ్. దుర్గాను దెబ్బతీయాలంటే అతని కొడుకుపై టార్గెట్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు నారాయణ్. దీంతో హైదరాబాద్ వచ్చిన రామ్ గతంలో దుర్గాలా మారి తండ్రీ కొడుకులకు తగిన శిక్ష విధిస్తాడు.

దుర్గా పాత్రలో జగపతిబాబు బాగా చేశాడు. ఆయన హావభావాలు రౌడీగా బాగా సూటయ్యాయి. వయొలెన్స్ చేయడానికి అవసరమైన హావభావాలు పలికించాడు. విమలారామన్ భార్యగా నటించింది. చక్కటి శృంగారపు విందును పంచింది. విమలా రామన్ చక్కటి రిలీఫ్ ఇచ్చిందని జగపతిబాబు చెప్పిన మాటలు యదార్థమని అనిపించాయి. కోట శ్రీనివాసరావు పాత్ర హైలెట్. తెలంగాణా యాస అద్భుతంగా పలికాడు. పదవికోసం పాకులాడే నీచపు రాజకీయ నాయకునిలా జీవించాడు. కన్నకొడుకు చనిపోయిన సన్నివేశంలో గుండెలు పిండాడు. సలహాలు ఇచ్చే లాయర్*గా తనికెళ్ల భరణి బాగా సూటయ్యాడు. సైలెంట్ క్రిమినల్*గా నప్పాడు. ఆవేశపరుడు, దుందుడుకు స్వభావంగల పాత్రను కోట ప్రసాద్ మెప్పించాడు. పోలీసు అధికారిగా జీవా, కాస్త కామెడీని పండించే పాత్రలో హర్షవర్థన్ ఇంకా మిగిలిన తారాగణమంతా ఫర్వాలేదు.

గాయం చిత్రానికి సీక్వెల్*గా కలిపే విధంగా స్క్రీన్ ప్లే అల్లడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. అప్పటి తారాగణం రేవతి, శివకృష్ణ, జగపతిబాబు, భరణి పాత్రల తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఒక్కసారి గుర్తుకు చేసుకునేలా ఉన్నాయి. ప్రధానంగా కెమేరా పనితనం బాగుంది. నాగరాజు సంభాషణలు వర్తమాన రాజకీయాలకు సరిపోయాయి. "బ్యాలెట్ కాదు.. బుల్లెట్ డిసైడ్ చేస్తుంది పదవి కావాలంటే..", "రాచపీనుగ ఒంటరిగా పోదు.. మనం చేసే లొల్లి అధిష్టానానికి తెలుసు.. తెలియంది గొర్రెల్లాంటి ప్రజలకే.." వంటివి మచ్చుకు కొన్ని.

సాహిత్యపరంగా... రాజకీయం ఉన్నచోట ధర్మముండదు. నీతి అంటే బూతు అంటారు. రౌడీయిజం చేసేటోడే నేత' వంటి రెండు పాటలు బాగున్నాయి. అయితే కొన్ని సంభాషణలు.. వర్తమాన రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. సీఎం పదవికోసం గొడవలు చేస్తూ.. విద్యార్థుల్ని చంపి ఆత్మహత్యలుగా సృష్టించడం.. ప్రస్తుత సీఎంని దించాలంటే.. పోరాటం చేయాలి. మా వాటా.. మేం అడుగుతున్నాం.. ఉద్యోగాల్లోనూ, పంటల విషయంలోనూ.. హక్కులకోసం ఉద్యమించడం నేరమా.. అంటూ సాగే సంభాషణలు ఎక్కడో తగులుతాయి.

అలాగే మీడియాపై సెటైర్లు అతికినట్లున్నాయి. నారదుని మాదిరి ఛానళ్లు ఇద్దిరి మధ్య సెగ పెట్టి పబ్బం గడుపుకోవడం.. సెన్సేషనల్ న్యూస్ అనేవి పేమెంట్ న్యూస్ అంటూ.. సూట్ కేసులు ఛానళ్లు ప్రతినిధికి ఇవ్వడం.. వంటివి కూడా ఘాటైన సెటైర్లే.

మొత్తం తెలిసిన కథే అయినా రాజకీయాల్లో జరుగుతుంది ఇది అని చెప్పే విధానంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇటువంటి చిత్రాలు మాస్*కు బాగా ఎక్కుతాయి. కొన్ని సన్నివేశాలు మరింత సెన్సేషనల్ అయితే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. సీరియస్ మూవీ అయినా బోర్ అనిపించదు. మొత్తానికి గాయం-2 చూడదగ్గ చిత్రం.

No comments:

Post a Comment